ఛందస్సు అనేది పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రం. ఇందులో పద్య రచనా విధానం, ఛందో లక్షణాలు,నియమాలు మున్నగు వాటి గురించి వివరించబడి ఉంటుంది. పద్యం యొక్క లయ యతి గణ ప్రాసల అమరికను తెలుపుతుంది. ణ యతి ప్రాసలతో కూడిన పద్యం క్రమపద్ధతిలో సాగుతూ ఒక చట్టంలో బిగించినట్లుగా ఉంటుంది. దీని వలన పద్యాన్ని రాగయుక్తంగా పాడుకోవడానికి, త్వరగా నేర్చుకోవడానికి వీలవుతుంది.
ఒక పాదానికి ఒక అక్షరం మొదలుకొని 26 అక్షరాల వరకు గల వృత్త చందస్సుల రకాలు ఉన్నాయి. 26 అక్షరాలకు మించి ఉన్నట్లయితే వాటిని 'ఉద్దురమాల' పద్యాలు అని అంటారు.ఈ వృత్తాలు సంస్కృత భాషా సంప్రదాయాన్ని అనుసరించి తెలుగులోనికి వచ్చినవి. ఇవి కాక జాతులు, ఉపజాతులు, అక్కరలు, రగడలు, దండకం వంటి వివిధ ఛందో రూపాలు తెలుగులో ఉన్నాయి.
ఆధునిక కాలంలో ముత్యాల సరాలు అనే మాత్రా ఛందస్సును గురజాడ వారు పరిచయం చేశారు.
అంతేకాక, కూనలమ్మపదాలు,గజళ్లు, నానీలు, హైకూలు వంటి ఛందో ప్రక్రియలున్నాయి.
పద్యరచనకు చందస్సులో కొన్ని నియమ నిబంధనలు ఉన్నట్లుగానే, నిషేధాలు కూడా ఉన్నాయి. గ్రంథ రచన ప్రారంభంలో పద్యాన్ని మగణం, భగణం నగణం వంటి గణాలతో ప్రారంభిస్తే శుభకరమని సగణంతో ప్రారంభం చేస్తే అశుభమని తెలియజేసి ఉన్నారు.అలాగే విసంధి, పునరుక్తి వంటి పది రకములైన దోషాలను కూడా సూచించి ఉన్నారు. ప్రారంభ పద్యంలో ఆరవ అక్షరంగా 'త' ఉండరాదని అలా ఉంచి రచన చేస్తే కృతి భర్తకు కీడు జరుగుతుందని కూడా హెచ్చరించారు.
"విశ్వశ్రేయః కావ్యమ్ " అని పెద్దలు చెప్పారు కాబట్టి, పద్య రచన చేయాలనుకునే ఔత్సాహికులైన విద్యార్థులు కేవలం పద్య లక్షణాలనే కాక ఛందో నియమాలను, నిషేధాలను గూర్చి క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.