"సమర్థ పద నిధిః సమాసః" అని పాణినీ మహర్షి అష్టాధ్యాయిలో సమాసం యొక్క నిర్వచనాన్ని తెలియజేశారు.
చిన్నయసూరి గారు తన బాలవ్యాకరణం లో "సమర్ధంబులగు పదంబు లేక పదంబగుట సమాసంబు" అని సూత్రీకరించారు.
ఏకార్థీ భావరూపమగు పదాలు అఖండ పదమగుట సమాసం. అనగా తగిన సామర్థ్యం గల రెండు పదాలు చేరి ఒకే పదంగా మారడం సమాసం. ఈ సామర్థ్యం వ్యపేక్ష, ఏకార్థీ భావం అని రెండు విధాలు.
వ్యపేక్ష వాక్యంలోను ఏకార్థీ భావం సమాసం లోను ఉంటుంది. ఆ యా అర్థాలను తెలియజేసే పదాలకు ఆకాంక్ష (ప్రశ్నించడం) వలన పరస్పరం ఉండే సంబంధం వ్యపేక్ష. వేరు వేరు అర్థాలు గల పదాలు కలిసి ఒకే అర్థాన్ని కలుగజేస్తే అది ఏకార్థీ భావం. కొన్ని సమాసాలలో ఇవి రెండూ ఉంటాయి. కొన్నింటిలో ఏకార్థీ భావం మాత్రమే ఉంటుంది.
సమాసాలు అనేక భేదాలతో కూడి ఉన్నాయి. ఇవి కావ్య రచనకు ఎంతగానో ఉపయుక్తమైనవి. కవులు, రచయితల భావ వ్యక్తీకరణకు, ప్రతిభను ప్రదర్శించడానికి ఎంతగానో తోడ్పడుతాయి. భాషలో అధికంగా ఉన్న పదాలను క్లుప్తీకరించి విపులమైన భావాన్ని అందిస్తాయి.
కొంతమంది కవులు తమ కావ్యాలలో దీర్ఘ సమాసాలను ఉపయోగించిన సందర్భాలు కోకొల్లలు. ఉదాహరణకు, మనుచరిత్ర కావ్యంలో అల్లసాని పెద్దన గారు ఒక పద్యంలో "అటజని కాంచె...." అనే పదాలు తప్ప మిగిలిన మూడు పాదాలు ఒకే సమాసంగా ఉండడం మనకు విదితమే.
ఒక్కోసారి సమాసాల అర్థాలు ఆ యా సందర్భాన్ని బట్టి కూడా మారుతుంటాయి.ఇలా భాషకు నిండుదనాన్ని చేకూర్చే ఈ సమాసాల లోని భేదాలను గురించి విద్యార్థులు తప్పక తెలుసుకొనవలసిన అవసరం ఉన్నది.