పదార్థైః పదవిజ్ఞాతైః వాక్యార్థః ప్రతిపద్యతే...
పద సంఘటితమ్ వాక్యమ్...
పదసమ్మేళనము వాక్యము నాఁబడు...
పదార్థం వల్లనే వాక్యం పుడుతుంది...
వక్త యొక్క అర్థయుక్తమైన శబ్దసముదాయం వాక్యం...
సంపూర్ణభావాలనువ్యక్తీకరించు పదసముదాయం వాక్యం...
ఒక విషయాన్ని అర్థవంతంగా, సంపూర్ణంగా, స్పష్టంగా, భావప్రకటన కలిగించే పదాల సముదాయం వాక్యం...
ఇలా వాక్యానికి అనేకవిధాలుగా నిర్వచనాలు చెప్పబడి యున్నవి.
ముఖ్యంగా వాక్యంలో యోగ్యత, ఆకాంక్ష, ఆసత్తి అను మూడు అంశాలు ఉంటాయి. యోగ్యత అనగా సంబంధార్హత్వం. వాక్యంలోని పదాలకు పరస్పర సంబంధం ఉండాలి దానితోబాటు ఒక ప్రయోజనం కలిగి ఉండాలి. ఆకాంక్ష అనగా వాక్యంలోని పదములు, వాటి అర్థాలపై ఆపేక్ష కలగాలి. ఆసత్తి అనగా వాక్యంలోని పదాలను అర్థమయ్యేవిధంగా సన్నిహితత్వంతో వెంటవెంటనే పలకాలి.ఈ వాక్యం కర్త, కర్మ, క్రియలతో ముడిపడి ఉంటుంది. ఇలా ఉన్న దానికి సామాన్యవాక్యం అని పేరు.
దీనికి 'ప్రయోగము'అని కూడా పేరు ఉంది. అందువల్లనే కర్తరి ప్రయోగం, కర్మణిప్రయోగం అనే పేర్లు ఏర్పడినాయి. ప్రాచీన కాలంలో ఈ రెండింటి ఆధారంగానే వాక్యనిర్మాణం చేసేవారు. పరభాషల ప్రభావంతో నేడు వివిధ రకాలైన వాక్యాలు పుట్టుకొచ్చినవి.
వాక్యం అనేది పూర్తి ఆలోచనలతో నిండి, చదివినపుడు, విన్నప్పుడు అర్థమయ్యే విధంగా ఉండాలి. ప్రకటనలు, ప్రశ్నలు, ఆజ్ఞలు, ఆశ్చర్యార్థకాలు మున్నగు వివిధ రూపాలలో వాక్యాలున్నాయి.
సమర్థవంతంగా, స్పస్టంగా భావప్రకన చేయడం కోసం, విద్యార్థులు వాక్యభేదాలను సమగ్రంగా అధ్యయనం చేసి గొప్ప సాహితీవేత్తలుగా ఎదగాలి.