ఈ పాఠ్యాంశానికి చెందిన TLM కావాలంటే కింది బటన్స్ పై క్లిక్ చేసి
డౌన్లోడ్ చేసుకోండి
వ్యాకరణ విజ్ఞానం
వ్యాకరణమనగా ప్రకృతి ప్రత్యయ విభాగం. దీనికి నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాతాలు, వర్తమాన భూత భవిష్యత్కాలాలు, సుబంత తిఙంతాలు, ఏడువిభక్తులు మున్నగునవి అంగాలు.
వేదాలు శాస్త్రాలు చదవక పోయినా వ్యాకరణం తప్పనిసరిగా నేర్చుకోవాలనేది పెద్దల మాట.పదాలను అర్థాలను తప్పుగా పలికితే అర్థం మారిపోయి ఫలితం తారుమారవుతుంది.
సంస్కృత ప్రాకృత భాషల్లో మాత్రమే గ్రంథరచన సాగుతున్న కాలంలో రాజరాజనరేంద్రుని కోరిక మేరకు నన్నయభట్టు ప్రాచీన భాషయైన తెలుగులో భారత రచనకు సంకల్పించి, ముందుగా 'ఆంధ్రశబ్దచింతామణి' అను పేర సంస్కృతశ్లోకాలలో తెలుగు వ్యాకరణ రచన చేశాడు. తరువాత దీనికి విపులీకరణంగా చేసిన రచన 'అధర్వణకారికావళి.'ఇది కూడా సంస్కృతశ్లోకాలతో కూడినదే.
తరువాతి కాలంలో ఎన్నో పద్యవ్యాకరణాలు వచ్చినా అవి అంతగా ప్రాచుర్యం పొందలేదు.
చిన్నయసూరి గారి 'బాలవ్యాకరణం' అత్యంత ప్రజాదరణ పొంది నేటికీ విద్యార్థులకు ప్రామాణిక వ్యాకరణ గ్రంథంగా వెలుగొందుతున్నది. దీనికి కొనసాగింపుగా బహుజనపల్లి సీతారామాచార్యులుగారు బాలవ్యాకరణంలో లేని అంశాలను వివరిస్తూ 'ప్రౌఢ వ్యాకరణం' రచించారు.
వ్యాకరణం సరిగా తెలియక పోతే భాషపై పట్టు సాధించలేమన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి.